ఉత్తర ప్రదేశ్‌లో రూ.7,145.14 కోట్ల మూలధన వ్యయంతో ఎన్‌హెచ్-34 కాన్పూర్- కబ్రాయ్ 4/6 లైన్ల యాక్సెస్- కంట్రోల్డ్ రహదారి నిర్మాణం

July 01st, 03:09 pm

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్-కబ్రాయ్ యాక్సెస్- కంట్రోల్డ్ నూతన రహదారి నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల కార్యక్రమం ద్వారా రూపుదిద్దుకుంటున్న భోపాల్-కాన్పూర్ ఎకనామిక్ కారిడార్‌లో ఈ రహదారి కీలకం కానుంది. ప్రస్తుతం ఇది 4 లైన్ల యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్‌గా నిర్మితమతున్నప్పటికీ, భవిష్యత్తులో దీనిని 6 లైన్లుగా విస్తరించడానికి వీలుగా దీనికి రూపకల్పన చేశారు. మొత్తం రూ.7,145.14 కోట్ల మూలధన వ్యయంతో వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), బీఓటీ టోల్ పద్ధతిలో అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త రహదారి నిర్మాణంతో పాటు ప్రస్తుత ఎన్‌హెచ్-34 లోని కాన్పూర్-కబ్రాయ్ విభాగం నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఎన్‌హెచ్ఏఐ చూసుకుంటుంది.